- ఎన్నికల్లో గెలిస్తే ఘనత.. ఓడితే నిందలా?
- రాహుల్‌ను పీఎం చేయాల్సింది ఈవీఎంలు కాదు.. ప్రజలే
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా డబ్బా కొట్టుకోవడం, ఓడిపోతే ఈవీఎంలు,ఈసీపై బురదజల్లడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు, ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని పీఎం చేయాల్సింది ఈవీఎంలు కాదనీ, ప్రజల మద్దతు అని చెప్పారు. బీజేపీ ఎన్నడూ ఓట్లను కొట్టేయదనీ, ప్రజల మనసులను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ వైఖరిలో ఏమాత్రం మార్పు రావడం లేదని సెటైర్వేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారీ ఈవీఎంలు, రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చాలా బాగా పనిచేసినట్లా? అని ప్రశ్నించారు. కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పినట్లు ఓటర్ల జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగిస్తే ఈసీ ఉత్తమమైనదిగా సర్టిఫికెట్లు ఇచ్చారని గుర్తుచేశారు. బెంగాల్లో చనిపోయిన 24 లక్షల మంది ఓట్లు, పర్మనెంట్‌గా వలస వెళ్లిన 19 లక్షల మంది ఓట్లు, చిరునామా లేని 12 లక్షల మంది ఓట్లు, దాదాపు 2 కోట్ల డూప్లికేట్ ఓట్లను లిస్టు నుంచి తొలగిస్తే తప్పేముందని ప్రశ్నించారు.
ఎన్డీయే పాలనలో అవినీతి మరకే లేదు
12 ఏండ్ల ఎన్డీయే పాలనలో ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, గత యూపీఏ పాలన అంతా కుంభకోణాల మయంగా సాగిందని ఎద్దేవా చేశారు. యూపీ,బీహార్, బెంగాల్, గుజరాత్, ఏపీల్లో కాంగ్రెస్‌కు ప్రజలు ఎప్పుడో అడ్రస్ లేకుండా చేశారని, అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తెచ్చారని విమర్శించారు. తెలంగాణలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన రేవంత్ రెడ్డి.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి సోనియా కుటుంబం కోసం ప్రాణాలిస్తా అనడం సిగ్గుచేటన్నారు. కాగా, బీజేపీ స్టేట్ఆఫీసులో జరిగిన తెలంగాణ ఉద్యమ యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో కిషన్‌రెడ్డి పాల్గొని నివాళి అర్పించారు.
పదవులను త్యాగం చేసిన మహనీయుడు బాపూజీ: బీజేపీ నేతలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికారాన్ని, పదవులను త్యాగం చేసిన నికార్సయిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీజేపీ నేతలు కొనియాడారు. నాంపల్లిలోని ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సమత తదితరులు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటం, రజాకార్ల వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ సాధన ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు. ముఖ్యంగా 1969 తొలిదశ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేయడమే కాకుండా.. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేవరకు ఏ మంత్రి పదవినీ చేపట్టబోనని శపథం చేసి తుదిశ్వాస వరకు ఆ మాటకు కట్టుబడిన నిబద్ధత గల నాయకుడని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల ఆర్థిక అభ్యున్నతి కోసం నిరంతరం వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు.
